Top News

Demo NEWS

సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ..కోట్లాది మంది ప్రజల అకాంక్షలను నెరవేర్చుతూ టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. శనివారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ ఏడు పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. అసాధారణ ఆటతో తొలిసారి విశ్వకప్ ఫైనల్‌కు దూసుకొచ్చిన దక్షిణాఫ్రికా చివరి వరకు గట్టిపోటీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. చిరస్మరణీయ ఆటతో అదరగొట్టిన టీమిండియా తన ఖాతాలో రెండో ప్రపంచకప్ ట్రోఫీని జతచేసుకుంది.


బార్బడోస్: టి20 ప్రపంచకప్ సూపర్8లో టీమిండియా బోణీ కొట్టింది. గురువారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన గ్రూప్1 మ్యాచ్‌లో భారత్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (8) విఫలమయ్యాడు. విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20) పరుగులు చేశారు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు.

 టి20 ప్రపంచకప్ సూపర్8 పోరులో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన గ్రూప్1 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 28 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 11.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు సాధించింది. ఈ సమయంలో వర్షం రావడంతో ఆట ముందుకు తగ్గలేదు. తర్వాత డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితాన్ని తేల్చారు. ఇందులో ఆస్ట్రేలియా ఘన విజయం అందుకుంది. సునాయాస లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్‌లు శుభారం అందించారు.

 టి20 ప్రపంచకప్‌లో ఆదివారం పెను సంచలనం నమోదైంది. ప్రపంచకప్ సూపర్8లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన గ్రూప్1 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 21 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని అందుకుంది. పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించి అఫ్గాన్ సెమీ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో కేవలం 127 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన కంగారూలకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, వార్నర్‌లు విఫలమయ్యారు. హెడ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. నవీనుల్ హక్ అద్భుత బంతితో అతన్ని క్లీన్‌బౌల్డ్ చేశాడు. మరోవైపు వార్నర్ కూడా 3 పరుగులు మాత్రమే చేసి నబి బౌలింగ్‌లో ఔటయ్యాడు.

 సౌతాఫ్రికాతో వన్డే సిరీస్

బెంగళూరు: దక్షిణాఫ్రికా మహిళలతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఆతిథ్య భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 30తో క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 215 పరుగులు సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 40.4 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

 బెంగళూరు: తనపై ఓ ఎంఎల్‌సి అత్యాచారం చేశాడని ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం హాసన జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జనతాదళ్ కార్యకర్త(25) అరకలగూడలో నివసిస్తున్నారు. ఓ ఎంఎల్‌సి తనను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు ఉద్యోగం ఇప్పిస్తానని పలుమార్లు చెప్పారు. ఒక రోజు సదరు ఎంఎల్‌సి తనను బెదిరించి అత్యాచారం చేశాడని జనతాదళ్ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 15 పేజీల లేఖను అతడు పోలీసులకు అందజేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అతడి ఒంటిపై గాయాలు ఉన్నట్టు గుర్తించామని, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. జనతాదళ్ కార్యకర్త తనకు ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని, తాను ఇవ్వకపోవడంతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని హొళెనరసిపుర పోలీస్ స్టేషన్‌లో ఎంఎసి అనుచరుడు ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణ, మాజీ మంత్రి హెచ్ డి రేవణ్ణ, ఆయన సతీమణి భవానీ కేసుల విషయ హాసనలో కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

 బెంగళూరు: కామంతో కళ్లు మూసుకొని తల్లిలాంటి మేనత్తపై మైనర్ బాలుడు అత్యాచారం చేయడంతో పాటు ఆమెను హత్య చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉప్పినంగడి గ్రామంలో ఓ మహిళ(37) మృతి చెందడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోవడంతో ఎలా చనిపోయిందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం ఎక్కడ గాయాలు లేకపోవడంతో ఆమె మరో వ్యక్తితో పెనుగులాట జరిగినట్టు ఆనవాళ్లు గుర్తించారు. పదో తరగతి విద్యార్థి మేనత్త గుండెపోటుతో మృతి చెందిందని తండ్రికి చెప్పాడు. దీంతో బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. సాయంత్రం సమయంలోనే మేనత్త ఇంటికి వెళ్లేసరికి ఆమె గాఢ నిద్రలో ఉందని, ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించడంతో ప్రతిఘటించింది. ఈ విషయం మీ తల్లిదండ్రులకు చెబుతానని హెచ్చరించడంతో ఆమె తలపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశా అని బాలుడు ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని జువైనల్ హోమ్‌కు తరలించారు.

హైదరాబాద్: మేడ్చేల్ లోని నగల దుకాణంలో ఇద్దరు దుండగులు కత్తులతో బెదిరించి దోపిడీ చేశారు. వారు నగదును తీసుకుని పారిపోయారు. దుండగులిద్దరూ బుర్ఖా, హెల్మేట్ ధరించి దోపిడీ చేశారు.  వారిని షాపు యజమాని కుమారుడు స్టూల్  విసిరి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దుకాణం యజమాని శేషురామ్ చౌదరిని దుండగులు గాయపరిచారు కూడా. ఆయన ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదిలావుండగా జగదాంబ జ్యువేలరీ షాఫు సిసి కెమెరాల సీసీ ఫుటేజ్, బైక్ నంబర్, ఇతర  ఆధారాలతో  పోలీసులు  24 గంటల్లోనే దుండగులను పట్టుకున్నారు. వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మాస్కో: రష్యాలోని పేట్రోల్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 35 మంది మరణించారు. పేలుడు ఘటనలో మరో 100 మందికిపైగా గాయాలయ్యాయి. కార్ల సర్వీసింగ్ సెంటర్ నుంచి మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకుని వాహనాలు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 256 ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు.

మాస్కో: రష్యాలోని డాగేస్థాన్‌లో మిలిటెంట్లు దాడులకు పాల్పడ్డారు. చర్చిలు, యూదుల ప్రార్థనమందిరం, పోలీసుల పోస్టుపై సాయుధులైన మిలిటెంట్లు తుపాకులతో కాల్పులు జరపడంతో 15 మంది పోలీసులు మృతి చెందారు. పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. మఖచ్‌కల, డెర్బెంట్ నగరాల్లోని చర్చిలు, ప్రార్థనామందిరాలను మిలిటెంట్లు లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడినట్టు సమాచారం. వెంటనే రష్యా భద్రతా బలగాలు రంగంలోకి దిగి ఆరుగురు మిలిటెంట్లను కాల్చి చంపాయి. ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని జాతీయ ఉగ్రవాద నిరోదక కమిటీ ప్రకటించింది. ఈ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువగా ఉండడంతో గతంలో కాల్పులు జరిగిన సంఘటనలు ఉన్నాయి.